100 ఎకరాల్లో పునరుద్ధరణ చేయండి, లేకపోతే అందరూ జైలుకే….!
నేటి దర్శిని న్యూస్ డెస్క్: హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా చెట్లు నరికి, ప్రకృతి సమతుల్యతను భంగం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యంగా చెట్ల నరికివేతతో జింకలు బయటకు రావడం, అవి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. “ఆ వీడియోలు చూసి మేమూ ఆందోళనకు గురయ్యాం,” అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. చెట్లు నరికే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా అన్నదాన్ని స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ సహా సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తూ, “100 ఎకరాల్లో చెట్ల పునరుద్ధరణ చేయాలి. చేయకపోతే చీఫ్ సెక్రటరీని, ఇతర అధికారులను జైలుకు పంపుతాం,” అని స్పష్టం చేశారు. ఇంతటితో ఆగకుండా, “పునరుద్ధరణకు ప్రభుత్వ అధికారులు సహకరించకపోతే, అదే భూముల్లో టెంపరరీ జైలు కట్టి అందులోనే వారిని ఉంచుతాం,” అని న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. తీర్పు ఇచ్చాక కూడా యూనివర్సిటీ భూముల్లో బుల్డోజర్లు ఉండటం పట్ల న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “మేము చెప్పే వరకు HCU భూముల్లో ఒక్క చెట్టును కూడా నరకకూడదు,” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.