Spread The Love

నల్గొండ మార్చి27 (నేటి దర్శిని):
జిల్లా అదనపు సెషన్స్ & ఎస్సీ ఎస్టీ కోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి రోజా రమణి ఇచ్చిన తీర్పు ప్రకారం, నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన నల్లబోతు జగన్‌కి మొత్తం 27 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా కూడా విధించారు. గుర్రంపోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ కేసులో, నల్లబోతు జగన్ ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. అతని మాయమాటలు నమ్మి యువతి అతనితో సంబంధం కొనసాగించగా, గర్భవతిగా మారింది. అయితే, వివాహం చేసుకోకుండా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టు విచారణలో, నిందితుడి దుష్కృత్యాలు రుజువుకాగా, న్యాయమూర్తి రోజా రమణి అతడికి కఠిన శిక్ష విధించారు. అత్యాచారానికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా, దళిత యువతిని మోసగించినందుకు మరో 10 ఏళ్లు, రూ. 1,000 జరిమానా, పెళ్లి చేసుకుంటానని మోసం చేసినందుకు 7 ఏళ్ల జైలు శిక్ష, రూ. 1,000 జరిమానా విధించారు. ఈ తీర్పుతో బాధిత యువతికి న్యాయం లభించిందని ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం భవిష్యత్తులో ఇటువంటి ఘాతుకాలకు అడ్డుకట్ట వేస్తుందని మహిళా సంఘాలు అభిప్రాయపడ్డాయి.