Spread The Love

నేటి దర్శిని న్యూస్ డెస్క్ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు సాధించాల్సిన అంశం గల్లీలో కాదు, ఢిల్లీలో తేల్చుకోవాలని ఆయన అధికారపక్షానికి చాలెంజ్ చేశారు. “షార్ట్ నోటీసులో ఆల్ పార్టీ మీటింగ్‌కు రమ్మంటే ఎలా?” అంటూ ప్రశ్నించిన ఆయన, “మీ పంచాయితీ అంతా ఢిల్లీలోనే కదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో అన్ని పార్టీల సమావేశం పెట్టుదాం. ఎంపీలందరం కలిసి కేంద్ర మంత్రులను కలుద్దాం” అని సూచించారు. తాజాగా ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తెలంగాణ అభివృద్ధి పట్ల బీజేపీ కంటే ఎక్కువ చిత్తశుద్ధి ఇంకెవరికి ఉంది?” అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను విమర్శించిన ఆయన, కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలుపై దృష్టిపెట్టాలని అన్నారు. “రేవంత్ రెడ్డి తాను చేయాల్సిన పనిని చేయకుండా కేంద్రంపై నిందలు వేయడం సరికాదు” అని ఆరోపించారు. “కేంద్రం రూ.500 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ కడితే, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లతో రోడ్డు వేయడానికి చేతగాలదా?” అని ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్ అరెస్టుకు రేవంత్ ఎందుకు భయపడుతున్నారు?

“బీజేపీ, బీఆర్ఎస్‌కు ఒప్పందం ఉందని పుకార్లు సృష్టించడం మానేయండి. మీ వద్ద అన్ని వ్యవస్థలూ ఉన్నాయ్ కదా? నిరూపించండి!” అంటూ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “బీజేపీకి బీఆర్ఎస్‌తో ఒప్పందం ఉంటే, కవిత జైలుకు ఎందుకు వెళ్ళారు?” అని ప్రశ్నించిన ఆయన, నిజానికి కాంగ్రెస్‌కే బీఆర్ఎస్‌తో సంబంధం ఉందని, అందుకే కేసీఆర్, కేటీఆర్‌ను అరెస్టు చేయడం లేదని ఆరోపించారు. “14 నెలల పాలనలో కేసీఆర్ నుంచి కాళేశ్వరం అవినీతికి సంబంధించిన 14 పైసలు కూడా వసూలు చేశారా?” అని ప్రశ్నించిన ఆయన, “ఫార్ములా-ఈ రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేటీఆర్ అరెస్టుకు ఎందుకు వెనుకాడుతున్నారు? మీ ప్రభుత్వం పడిపోతుందని భయమా?” అని నిలదీశారు. “ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు విదేశాలకు పారిపోయారు. మిగతా నిందితులు ఇక్కడే ఉన్నారు. అరెస్టైన పోలీసులు ‘గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో’ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెబుతుంటే, ఆ సమయంలో సీఎం అయిన కేసీఆర్ ఎక్కడున్నారో మీకు తెలియదా?” అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు.