సిరిపురం యాదయ్య త్యాగం మరువలేనిది రాజ్ కుమార్ రెడ్డి
కొత్తపేటలో ఘనంగా తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య వర్ధంతి వేడుకలు
సిరిపురం యాదయ్యకు నివాళులర్పించిన రాజ్ కుమార్ రెడ్డి



ఎల్.బీ.నగర్ ఫిబ్రవరి20 (నేటిదర్శిని):
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన సిరిపురం యాదయ్య ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కంకణ బద్ధులై పని చేయాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ అమరుడు సిరిపురం యాదయ్య 14వ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ డివిజన్ కొత్తపేట చౌరస్తాలో ఉన్న సిరిపురం యాదయ్య విగ్రహానికి విక్టోరియా మెమోరియల్ అనాథ విద్యాలయానికి చెందిన విద్యార్థులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో ఎంతోమంది అమరులయ్యారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాల సాధన కోసం యువత నడుం బిగించాలని కోరారు. అంతకుముందు కార్యక్రమ నిర్వాహకులు సిల్వేరు వెంకట్ గౌడ్, ఆరుట్ల వేణు తదితరులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విక్టోరియా మెమోరియల్ అనాథ విద్యాలయానికి చెందిన వందలాదిమంది విద్యార్థులతో పాటు, విక్టోరియా మెమోరియల్ అనాథ విద్యాలయం ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శివప్రసాద్, తెలంగాణ ఉద్యమకారులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

5