రెచ్చిపోతున్న రియ‌ల్ మాఫీయా

image

చింతపల్లిలో నిబంధనలకు పాతర…అక్రమ వెంచర్ల జాత‌ర‌..!

అనుమ‌తులు లేకుండా వెల‌సిన అక్ర‌మ వెంచ‌ర్‌..?

అమాయ‌కుల‌ను బురిడీ కొట్టిస్తు వైనం

చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్న రెవెన్యూ అధికారులు

నాలా క‌న్వ‌ర్ష‌న్, డీటీసీపీ అనుమ‌తులు లేకుండానే జోరుగా సాగుతున్న ప‌నులు

గడియ గౌరారం సర్వే నెంబర్ 24, 25 లో 8. 24 ఎకరాల విస్తీర్ణంలో అక్ర‌మ వెంచ‌ర్‌

అడ్డుకున్న‌ గడియ గౌరారం గ్రామస్తులు అధికారుల‌కు పిర్యాదు

నోటీసులు జారి చేసి, తగిన చర్యలు తీసుకుంటాం – పంచాయితీ కార్య‌ద‌ర్శి


చింతపల్లి (నేటి దర్శిని వెబ్ న్యూస్ డెస్క్) : నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో రియ‌ల్ మాఫీయా రెచ్చిపోతుంది. గ‌డియ గౌరారం గ్రామంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్ర‌మ వెంచ‌ర్ ప‌నులు చ‌క‌చ‌కా సాగిపోతున్నాయి. నాలా క‌న్వ‌ర్షన్ చేయ‌కుండానే.. డీటీసీపీ అనుమ‌తులు తీసుకున్న‌ట్లు అమాయ‌కుల‌ను బురిడీ కొట్టిస్తున్నారు. మోస‌పూరిత ప్ర‌క‌ట‌న‌ల‌తో భారీ ఎత్తున ప్లాట్ల విక్రయానికి తెరలేపారు. గడియ గౌరారం గ్రామ పరిధిలో వెలిసిన ఈ అక్రమ వెంచర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానిక గ్రామ‌స్థులు డిమాండ్ చేస్తున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు..!

నిబంధ‌న‌ల‌కు పాత‌ర వేసి ఎటువంటి అనుమ‌తులు లేకుండా చింత‌ప‌ల్లి మండ‌ల ప‌రిధిలో వెలుస్తున్న అక్ర‌మ వెంచ‌ర్ల‌పై రెవెన్యూ అధికారులు చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌ని ప‌లువురు ఆరోపిస్తున్నారు. ​గడియ గౌరారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 24, 25 లో సుమారు 8 ఎకరాల 24 గుంటల విస్తీర్ణంలో కొందరు రియ‌ల్ వ్యాపారులు అక్ర‌మంగా వెంచర్ ఏర్పాటు చేస్తున్నార‌ని గ్రామ‌స్తులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా ఒక వెంచర్ ఏర్పాటు చేయాలంటే డీటీసీపీ నుండి లే అవుట్ అనుమతి పొందడంతో పాటు ముందుగా గ్రామ పంచాయితీ అనుమ‌తులు త‌ప్ప‌నిస‌రి. అంత‌కంటే ముందు నాలా క‌న్వ‌ర్ష‌న్ (వ్య‌వ‌సాయేత‌ర భూమిగా) మార్చుకోవాలి. అందుకోసం మండ‌ల త‌హ‌సీల్ధార్ నుంచి నాలా క‌న్వ‌ర్ష‌న్ అయిన‌ట్లుగా ఎన్ఓసీ ప‌త్రం పొందాలి. ఇక త‌రువాత గ్రామ పంచాయితీకి ​వెంచర్ మొత్తంలో నిర్ణీత శాతం భూమిని రోడ్లు, సామాజిక అవసరాల కోసం రిజిస్టర్ చేయాలి. ​ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు చెల్లించిన అనంత‌రం డీటీసీపీ నుంచి తుది అనుమతి పత్రం పొందిన తర్వాతే పనులు ప్రారంభించాలి. ​అయితే ఈ వెంచర్ విషయంలో అవేమీ పట్టించుకోకుండానే, రాత్రికి రాత్రే జేసీబీల‌తో రోడ్లు వేయ‌డం, ప్లాట్లను మార్కింగ్ చేయడం వంటి పనులు చ‌క‌చ‌క‌ సాగిపోతున్నాయి. ఈ అక్ర‌మ వెంచ‌ర్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అధికారులు చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంపై స్థానిక ప్ర‌జ‌లు వాళ్ల‌కు ముట్టాల్సిన ముడుపులు ముట్టి ఉంటాయ‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

అక్ర‌మ వెంచ‌ర్‌పై గ్రామ‌స్తుల ఫిర్యాదు

​ఈ అక్రమ వెంచ‌ర్ నిర్మాణ‌ పనులపై గడియ గౌరారం గ్రామస్తులు ఏకమై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా, భవిష్యత్తులో ఈ ప్లాట్లు కొనుగోలు చేసే సామాన్యులు ఇబ్బందుల పాలవుతారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ అక్ర‌మ వెంచ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యదర్శికి లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేశారు. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి, ప్లాట్లు అమ్మడం వల్ల పంచాయతీ అభివృద్ధికై రావాల్సిన ఫీజులు, ప్ర‌జా అవ‌స‌రాల‌కు కోసం వదిలే స్థలాలు కూడా కబ్జాకు గురవుతున్నాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించి, ఈ పనులను ఆపాలని గ్రామస్తులు పంచాయితీ కార్య‌ద‌ర్శిని కోరారు. ​గ్రామస్తుల ఫిర్యాదుపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి ఈ వెంచర్ యజమానులకు ఎటువంటి అనుమతులు లేవని ప్రాథమికంగా ధ్రువీకరించిన‌ట్లు గ్రామ‌స్తులు పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన‌ట్లు తెలిపారు. ​వెంచర్ నిర్వాహకులకు వెంట‌నే నోటీసులు జారీ చ‌ర్య‌లు తీసుకోనున్నట్లు కార్య‌ద‌ర్శి హామీ ఇచ్చినట్లు గ్రామ‌స్తులు వెల్లడించారు. అత్యాశ‌తో ​తక్కువ ధరకు వస్తున్నాయని అనుమతి లేని ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కొని ప్రజలు మోసపోకుండా రెవెన్యూ, పంచాయతీ అధికారులు వెంట‌నే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.