గ్రామీణ స్థాయిలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు
ఎస్‌బిఐ ఆధ్వర్యంలో బీమా పథకాలపై అవగాహన – భారీగా పాల్గొన్న గ్రామస్తులు
చింతపల్లి, ఫిబ్రవరి27 (నేటి దర్శిని ప్రతినిధి): గ్రామీణ ప్రజల్లో పొదుపు అలవాటు, బ్యాంకింగ్ సేవల వినియోగం, డిజిటల్ లావాదేవీలు, కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన పెంపొందించేందుకు మండల కేంద్రంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ స్థాయిలో ఆర్థిక భద్రత ప్రతి కుటుంబానికి అవసరమని వక్తలు పేర్కొన్నారు. (State Bank of India) ఎస్‌బిఐ చింతపల్లి శాఖ మేనేజర్ మణిదీప్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల ప్రాధాన్యం, రుణాల సద్వినియోగం, సైబర్ మోసాల నివారణ చర్యలపై వివరించారు. ప్రతి కుటుంబం కనీసం ఒకరు బీమా పథకాల్లో నమోదు కావాలని సూచించారు. కొండమల్లెపల్లి ఆర్థిక అక్షరాస్యత అవగాహన కేంద్రం కౌన్సిలర్లు సిహెచ్. అంకులమ్మ, ఎన్. హేమ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల వివరాలు తెలియజేశారు. ప్రధానమంత్రి సురక్ష భీమ యోజన కింద వార్షిక ప్రీమియం రూ.20 మాత్రమేనని, 18–70 సంవత్సరాల మధ్య వయస్సు గల బ్యాంకు ఖాతాదారులు ఆటో డెబిట్ ద్వారా నమోదు కావచ్చని చెప్పారు. అలాగే ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమ యోజన కింద సంవత్సరానికి రూ.436 చెల్లించి జీవిత బీమా రక్షణ పొందవచ్చని వివరించారు. ఎస్‌బిఐ సి.ఎస్‌పి ఆపరేటర్ ఆర్. రామ, కుర్మేడు గ్రామ కార్యదర్శి తిరుపతి గౌడ్, ఉపసర్పంచ్ అనంతుల పవన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ పొగాకు సోమప్ప, కురుమేటి రామకృష్ణ, కేవైసీఎస్ నల్గొండ జిల్లా కార్యదర్శి నాదిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యత పెరిగితే కుటుంబాల ఆర్థిక స్థితి మరింత బలోపేతం అవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.
