మేళతాళాలతో రాజ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం
దామరగిద్ద డిసెంబర్ 20 (నేటిదర్శిని):
శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి తమవంతు కృషి చేస్తామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందన్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి తమవంతు సహాయ సహకారాలను అందిస్తామని హామీనిచ్చారు. గతంలో మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత దాసరి కొండప్పకు లక్ష రూపాయల విరాళం, బాపనపల్లిలో నిర్మిస్తున్న శివాలయానికి శ్లాబ్ నిర్మాణం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు తమ ఫౌండేషన్ తరపున సహాయాన్ని అందించామని తెలిపారు.

అదేవిధంగా పేద విద్యార్థులకు లాప్ టాపులు, నోటు పుస్తకాలు, దివ్యాంగులకు సహాయ, సహకారాలు, క్రీడాకారులకు యూనిఫాములను అందజేసినట్లు పేర్కొన్నారు. తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ నిర్మాణానికి సహాయ, సహకారాలు అందిస్తామని ప్రకటించిన ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డిని దేవాలయ నిర్వాహకులు, గ్రామస్తులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు గ్రామ పురవీధుల నుండి ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డికి డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాలయ నిర్వాహకులు రాజు, లాలప్ప, కొష్టప్ప, నరేందర్, భోంషప్ప, ఫౌండేషన్ సభ్యులు తిప్పన్న, బాలాజీ, గోపాల్, సుదర్శన్ రెడ్డి, వెంకటేష్, శివరాజ్, శ్రీనివాస్, నర్సింహ, సంతోష్, మధుసూదన్ రెడ్డి, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.