Spread The Love

◻️   పేటలో చేనేత కార్మికులను కలిసి సమస్యలను తెలుసుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ బృంద

◻️   తమ సమస్యలను పరిష్కరించాలని చేనేత కార్మికుల మొర

నారాయణపేట జూలై14 (నేటి దర్శిని):
చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకుంటానని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజకుమార్ రెడ్డి హామీనిచ్చారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సికిల్ గేరి లో పని చేస్తున్న చేనేత కార్మికులను ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి సోమవారం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు చాలీచాలని జీతాలు వస్తున్నాయని, దీంతో కుటుంబం గడవడం కష్టంగా మారిందని రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. తమకు పింఛన్లు రావడం లేదని, తమ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని వారు కోరారు.

చేనేత కార్మికులకు అండగా ఉంటాం

చేనేత కార్మికులకు అండగా ఉంటూ వారి సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. నారాయణపేటలో చేనేత కార్మికులు ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని, పూట గడవడం కూడా కష్టంగా ఉందని అన్నారు. నారాయణపేటలో చేనేత వృత్తిపై ఆధారపడి పని చేస్తున్న కొందరు మహిళా కార్మికులకు ఇప్పటికీ ప్రభుత్వం నుండి పింఛన్లు అందడం లేదని తన ముందు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు వారి పిల్లల చదువుల కోసం తమ ఫౌండేషన్ ఎల్లవేళల కృషి చేస్తుందని భరోసా కల్పించారు. అనంతరం చేనేత కార్మికులు వారు తయారుచేసిన దండ, శాలువాతో రాజ్ కుమార్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులతో పాటు ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, గోపాల్ గౌడ్, వెంకటరావు, హన్మంతు ముదిరాజ్, వై.సంతోష్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, నందుకుమార్, మన్నె గోపాల్, నర్సింహ, కృష్ణ యాదవ్, రాజు తదితరులు పాల్గొన్నారు.