బీసీలంతా ఏకతాటిపైకి రావాలి : అయితగోని రాఘవేంద్ర గౌడ్
పోరాటాల ద్వారానే బీసీలకు రాజ్యాధికారం: ఎంపీ ఆర్.కృష్ణయ్య
దేశవ్యాప్తంగా బీసీల ఉద్యమం: బీసీయూఎఫ్ జాతీయ అధ్యక్షు పాలూరి రామకృష్ణయ్య
బీసీలంతా సంఘటితం కావాలి: పల్లె రవికుమార్
ఎల్బీనగర్ లో ఘనంగా బీసీ ఆత్మీయ సమ్మేళనం
అధిక సంఖ్యలో తరలివచ్చిన బీసీలు, మహిళలు
ఎల్.బి.నగర్,సెప్టెంబర్10 (నేటి దర్శిని): బీసీలంతా ఏకతాటిపైకి వస్తే రాజ్యాధికారం సిద్ధించడం ఖాయమని బీసీ యునైటెడ్ ఫ్రంట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అయితగోని రాఘవేంద్ర గౌడ్ అన్నారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ లో బీసీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, ఓయూ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజరాంయాదవ్, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ షబ్బీర్ అలీ, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర నాయకులు పుటం పురుషోత్తమరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అయితగోని రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను మోసం చేస్తూనే వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 శాతం ఉన్న బీసీలు రాజ్యాధికారం దిశగా ముందుకు సాగుతున్నా, పాలకులు వారి ప్రయత్నాలకు కళ్లెం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా బీసీ యునైటెడ్ ఫ్రంట్ అడుగులు వేస్తుందని, త్వరలోనే రాజ్యాధికారం సాధించుకోవడం ఖాయమని ఆయన భీమా వ్యక్తం చేశారు.
బీసీల కోసం ఎనలేని పోరాటం చేస్తున్న బీసీయూఎఫ్: ఎంపీ ఆర్.కృష్ణయ్య

బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గతకొన్ని సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేస్తున్న బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య సేవలు ఎనలేనివని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య కొనియాడారు. రాజ్యాధికారం సాధించాలంటే బీసీలంతా ఏకతాటి పైకి వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. పాలూరి రామకృష్ణయ్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అత్యంత సన్నిహితం ఉందని, గతంలో బీసీలకు రావాల్సిన వాటాలపై ఆయన జాతీయ స్థాయిలో పోరాటం చేశారని గుర్తు చేశారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన అయితగోని రాఘవేంద్ర గౌడ్ యువకుడని, ఆయనకు పోరాటం చేసే ఓపిక, సత్తా ఉందని ప్రశంసించారు. వీరి ఆధ్వర్యంలో బీసీలకు రావాల్సిన వాటా సాధించుకోవడంతో పాటు రాజ్యాధికారం సాధించే దిశగా కృషి చేయాలని ఆయన సూచించారు. బీసీలకు రాజ్యాధికారం కోసం జరిగే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు.
బీసీయూఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో పోరాటాలు: పాలూరి రామకృష్ణయ్య

బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇప్పటికే అనేక పోరాటాలు చేయడం జరిగిందని బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య అన్నారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను రాఘవేందర్ గౌడ్ కు అప్పజెప్పడం జరిగిందని, ఆయన యువకుడు, సమాజం పట్ల మంచి స్పృహ కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. బీసీలకు రాజ్యాధికారం వచ్చేవరకు తమ పోరాటాలు ఆగవని అన్నారు.
వీరనారి ఐలమ్మకు ఘన నివాళులు

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్న ఆమె విగ్రహానికి బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు అయితగోని రాఘవేంద్ర గౌడ్ బీసీ నేతలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎల్బీనగర్ రింగ్రోడ్ నుండి సహారా రోడ్ లో ఉన్న ఎన్ని రెడ్డి గార్డెన్స్ సభా ప్రాంగణం వరకు కార్లు బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ కోశాధికారి పాలూరి లక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసు వాసు కె.యాదవ్, కోశాధికారి డాక్టర్ కాసోజు విద్యారాణి, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాపార్తి కుమార్ గార్కే, తెలంగాణ వనరుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోర శ్యాంసుందర్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు బొంగు వెంకటేష్ గౌడ్, వేముల కొండల గౌడ్ బైరు శేఖర్ గౌడ్, బడేటి సత్యనారాయణ, అంజయ్య గౌడ్, చంద్రపాల్, వెంకటేష్ గౌడ్, అధిక సంఖ్యలో మహిళలు, బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
