దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వీధికుక్కల స్వైర విహారం!

Picsart_25-07-07_14-32-46-011.jpg

రాత్రి 9.30 తర్వాత కనిపించని సిబ్బంది…

భయాందోళనలో రోగులు, చిన్నపిల్లల తల్లులు…

దేవరకొండ జూలై07 (నేటి దర్శిని):
నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో బాధితులకు చికిత్స అందాల్సిన చోట… వీధికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్న దృశ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళల్లో అత్యవసరంగా వైద్య సేవలు అందించే ఆసుపత్రి దుస్థితిని చూసి ప్రజలు ఖంగుతిన్న పరిస్థితి ఇది.

ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో తీసిన ఈ చిత్రాల్లో స్పష్టంగా కనబడుతోందేమంటే, ఎమర్జెన్సీ విభాగం ముందు కుక్కలు నడుస్తున్నాయి, ఆసుపత్రి లోపలికి స్వేచ్ఛగా వెళ్లి వచ్చేస్తున్నాయి. మరింత దురదృష్టకరంగా, ఆ సమయానికి అక్కడ ఎలాంటి సిబ్బంది గానీ, భద్రతా సిబ్బంది గానీ కనిపించలేదు. ఫోటోల్లో ఓ వీల్‌చైర్ ఖాళీగా బయట పడవేసి ఉంది. లోపల వైద్యం తీసుకునే వారికంటే ముందు ప్రవేశం చేసేది వీధికుక్కలే అనిపించే విధంగా నిర్మాణం ఉంది. అసలే అత్యవసర పరిస్థితుల్లో వచ్చే పేషెంట్లు తక్షణ సహాయం కోసం ఎదురుచూస్తుంటే, ఇలాంటివి వారిని మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

వీధికుక్కలు కాటేసే ప్రమాదం ఒకవైపు, అపరిశుభ్రమైన వాతావరణం కారణంగా వ్యాధులు వ్యాపించే అవకాశం మరోవైపు – ప్రభుత్వ హాస్పిటల్ పేరు మసకబారుతోంది. ఇది ప్రభుత్వ ఆరోగ్య విభాగంపై ఓ నిష్పక్షపాత విచారణ చేపట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతోంది.

స్థానికులు మాట్లాడుతూ, “ఒకవేళ రాత్రి ఎమర్జెన్సీకి ఎవైనా రోగి వచ్చినా… ఇక్కడ వైద్యుడు కనబడడం లేదు. గేట్ దగ్గర వార్డ్ బాయ్ అయినా ఉండటం లేదు. పైగా వీధికుక్కలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి తక్షణంగా స్పందించి విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ గారిని నేటి దర్శిని పత్రిక ప్రతినిధి వివరణ కోరగా నిర్లక్ష్య పూరిత సమాధానం ఎదురయ్యింది.