ePaper
Sunday, October 18, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణవిద్యార్థుల భవిష్యత్తుతో ‘శ్లోక’ స్కూల్ చెలగాటం!

విద్యార్థుల భవిష్యత్తుతో ‘శ్లోక’ స్కూల్ చెలగాటం!

📰 Generate e-Paper Clip

  • అనుమతులు లేకున్నా అడ్డగోలుగా 10వ తరగతి వరకు పాఠాలు

  • సీబీఎస్‌ఈ పేరుతో లక్షల్లో ఫీజుల దందా.. నోరుమెదపని యాజమాన్యం

  • ఎంఈఓ రామారావు లాలూచీపై వెల్లువెత్తుతున్న అనుమానాలు

ఉప్పల్, అక్టోబర్ 07 (నేటి దర్శిని):
రాష్ట్రంలో విద్యాశాఖ తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంతో ప్రైవేట్ యాజమాన్యాల అక్రమాలకు అడ్డాగా మారుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల అండదండలతో ప్రైవేట్ విద్యాసంస్థలు సామాన్య, మధ్యతరగతి వర్గాల జేబులు గుల్ల చేస్తున్నాయి. పిల్లలకు నాణ్యమైన విద్య దక్కుతుందనే నమ్మకంతో ప్రైవేట్ పాఠశాలలను ఆశ్రయిస్తున్న తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని, ఉప్పల్ భగాయత్‌లోని ‘శ్లోక పాఠశాల’ వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది.

ఈ పాఠశాలకు ఎలాంటి సీబీఎస్‌ఈ (C.B.S.E) అనుమతులు లేవు. అయినప్పటికీ బోర్డు పేరు చెప్పి అక్రమంగా తరగతులు నిర్వహిస్తూ రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటోంది. ప్రభుత్వం నుంచి కేవలం 7వ తరగతి వరకు మాత్రమే స్టేట్ సిలబస్ అనుమతులు పొందిన ఈ స్కూల్, అధికారుల నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని 10వ తరగతి వరకు నడుపుతూ దందా సాగిస్తోంది. గుర్తింపు లేని తరగతుల్లో విద్యార్థులను చేర్చుకుంటూ, చదువును వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను నిలువునా మోసం చేస్తోంది.

ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు కనీసం స్పందించకపోవడం వెనుక స్థానిక ఉప్పల్ ఎంఈఓ రామారావు పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నడుస్తున్నా ఎంఈఓ కానీ, యాజమాన్యం కానీ నోరు మెదపకపోవడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు పణంగా పెడుతూ అక్రమ వసూళ్లకు తెగబడుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం గమనార్హం.

వందలాది మంది విద్యార్థుల చదువు ప్రమాదంలో పడుతుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కీలక శాఖలను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ పెద్దలకు ఈ అక్రమాల బాగోతం చేరడం లేదా లేక క్షేత్రస్థాయి అధికారుల తీరుతో ఉపేక్షిస్తున్నారా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి శ్లోక పాఠశాల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన యాజమాన్యంతో పాటు సహకరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular