Homeతెలంగాణసమసమాజ స్థాపనకు కృషి చేసిన జగద్గురువు రామానుజాచార్యులు

సమసమాజ స్థాపనకు కృషి చేసిన జగద్గురువు రామానుజాచార్యులు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, ఏప్రిల్ 22 (నేటి దర్శిని): సమసమాజ స్థాపనకు శతాబ్దాల క్రితమే మార్గదర్శకత్వం చూపిన జగద్గురువు రామానుజాచార్యుల 1009వ జయంతి సందర్భంగా “రామానుజ కవి సమ్మేళనం” రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ పుల్లఖండం వెంకటయ్య పంతులు గారి ట్రస్ట్ (తుమ్మగూడెం), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా తుమ్మగూడెం గ్రామానికి చెందిన పుల్లఖండం కుటుంబం సేవలను స్మరించుకుంటూ ఏర్పాటైన ఈ ట్రస్ట్ ప్రతి సంవత్సరం సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ వస్తోంది. విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, నగదు బహుమతులు అందించడం, ఆచార్యులను సన్మానించడం వంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో సుమారు 50 మంది కవులు పాల్గొని రామానుజుల వైభవాన్ని కవితా రూపంలో వినిపించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త శ్రీమతి తిరునగరి జోత్స్న మాట్లాడుతూ రామానుజుల జీవితం సమాజానికి మార్గదర్శకమని, సనాతన ధర్మ ప్రచారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షుడు పుల్లఖండం వెంకటేశ్వర స్వామి అధ్యక్షత వహించగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి IAS పాల్గొన్నారు. తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షుడు బడేసాబ్ నిర్వహణలో కార్యక్రమం సజావుగా సాగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రకటించిన “రామానుజ అవార్డులు” పలువురు ప్రముఖులకు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో తిరునగరి జోత్స్న, అళహరి మధుసూధన స్వామి, గుండ్లూరు వినోద్ కుమార్ ఆచార్య, కందాళ శ్రీనివాస స్వామి, యదుగిరి జితేందర్, ధర్మపురి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సభలో ప్రసంగించిన పలువురు వక్తలు రామానుజాచార్యులు కుల, మత భేదాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రతిపాదించిన మహనీయుడని కొనియాడారు. ఆయన విశిష్టాద్వైత సిద్ధాంతం భారతదేశంలో సనాతన ధర్మాన్ని బలపరిచిందని పేర్కొన్నారు. ఇకపోతే, రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 18 నుంచి 22 వరకు నల్లకుంటలోని నర్మదా భవన్‌లో నాలాయిర దివ్యప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం భక్తులతో కలిసి శోభాయాత్ర నిర్వహించి, రవీంద్రభారతిలో జరిగిన కవి సమ్మేళనంతో కార్యక్రమాలు ముగిశాయి. కార్యక్రమంలో పాల్గొన్న కవులు, అతిథులను ట్రస్ట్ సభ్యులు ఘనంగా సన్మానించారు. చివరగా “జై రామానుజ” నినాదాలతో సభ ముగిసింది.

RELATED ARTICLES

Most Popular