మిడ్జిల్, జులై 03, (నేటి దర్శిని మహబూబ్ నగర్ జిల్లా బ్యూరో): జూలై 4న మిడ్జిల్ మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రజల్లో ఒక ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనేంతటి కీలక కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, జిల్లా మంత్రులు ఇప్పటివరకు మిడ్జిల్ వైపు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాత్రమే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే జిల్లా మంత్రులు స్వయంగా వచ్చి ఏర్పాట్లను పరిశీలించకపోవడం వెనుక కారణాలేంటనే ప్రశ్న స్థానికంగా వినిపిస్తోంది.
ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి సాధారణంగా సంబంధిత జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు సమన్వయంతో పనిచేయడం ఆనవాయితీ. అలాంటప్పుడు ఈ పర్యటన విషయంలో జిల్లా మంత్రుల గైర్హాజరు రాజకీయంగా ఏదైనా సంకేతమా? లేక ఇతర అధికారిక కార్యక్రమాల కారణంగానే రాలేకపోతున్నారా? అనే చర్చ సాగుతోంది.ఇంతటి ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి జిల్లా మంత్రులు దూరంగా ఉండటం వెనుక అసలు కారణాలపై అధికార పార్టీ నాయకత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: పై అంశాలు ప్రజల్లో వినిపిస్తున్న చర్చలు, ప్రశ్నల ఆధారంగా రూపొందించబడినవి. సంబంధిత వర్గాల అధికారిక వివరణ వస్తే పూర్తి సమచారం స్పష్టమవుతుంది.





