ఎమ్మెల్సీ ముందే బగ్గుమన్న అంతర్గత విభేదాలు..!
పార్టీ ఆఫీస్ వదిలి సొంత క్యాంప్‌లో బర్త్‌డే వేడుకలా..?
గుర్రంపోడు BRSలో బహిర్గతమైన వర్గపోరు..!
ఎమ్మెల్సీ కోటిరెడ్డి పర్యటనకు మాజీ మండల అధ్యక్షుడు డుమ్మా.. గుర్రంపోడులో వేడెక్కిన రాజకీయం
గుర్రంపోడు, జూలై03(నేటి దర్శిని): గుర్రంపోడు మండల నడిబొడ్డున గులాబీ పార్టీ అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. పార్టీ క్రమశిక్షణను సవాల్ చేస్తూ నేతల మధ్య ఉన్న వర్గపోరు గురువారం నాటి ఉదంతంతో పూర్తిగా బహిర్గతమైంది.మండల కేంద్రంలోని పాశం గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఆయన జన్మదిన వేడుకలు స్థానిక బిఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి హాజరైనప్పటికీ.. పార్టీలోని కీలక వర్గం దీనికి పూర్తిగా దూరంగా ఉండటం మండల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సొంత అజెండా.. సొంత కార్యాలయం!
పార్టీ అధికారిక కార్యాలయాన్ని కాదని, సొంత క్యాంపు కార్యాలయంలో ఈ వేడుకలను నిర్వహించడంపై పార్టీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వ్యక్తిగత ప్రచారం కోసమే పార్టీ వేదికను పక్కన పెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్య నేతల ‘బహిష్కరణ’?
ఎమ్మెల్సీ వంటి కీలక నేత హాజరైన ఈ కార్యక్రమానికి, గుర్రంపోడు బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడితో పాటు మెజారిటీ ముఖ్య నాయకులు గైర్హాజరు కావడం కలకలం రేపుతోంది. ఇది కేవలం గైర్హాజరు మాత్రమే కాదని, ఒక వర్గం కావాలనే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిందనే ప్రచారం జోరందుకుంది. ఒకే పార్టీలో ఉంటూ రెండు గ్రూపులుగా విడిపోయి పంతాలకు పోతుండటంతో గుర్రంపోడు గులాబీ రాజకీయం మరింత ముదిరేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ వర్గపోరు ఏ మలుపు తిరుగుతుందోనని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.





