శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

0
2287

📰 Generate e-Paper Clip

హాస్టల్ గదిలో ఉరివేసుకున్న 17 ఏళ్ల విద్యార్థి దేవేందర్‌రెడ్డి

కళాశాల యాజమాన్యంపై తల్లిదండ్రుల అనుమానాలు..!

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన

హయత్ నగర్, (నేటి దర్శిని): కోహెడలోని శ్రీచైతన్య కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. హనుమకొండకు చెందిన కోమటిరెడ్డి దేవేందర్‌రెడ్డి (17) హాస్టల్ గదిలో ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.హయత్‌నగర్ సీఐ నాగరాజ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం, దేవేందర్‌రెడ్డి ఇటీవల ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి, ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 2న అతని తండ్రి జలపతిరెడ్డి కళాశాలలో దింపి వెళ్లారు.గురువారం రాత్రి స్టడీ అవర్ అనంతరం గదికి వెళ్లిన సహ విద్యార్థులు, దేవేందర్‌రెడ్డి బెడ్‌షీట్‌, టవల్‌తో ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించారు. వెంటనే హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించగా, విద్యార్థిని కిందకు దించి హయత్‌నగర్‌లోని నీలాద్రి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులు, సహ విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

తల్లిదండ్రుల అనుమానాలు.. యాజమాన్యంపై ఆరోపణలు..?

చురుకుగా ఉండే దేవేందర్‌రెడ్డి అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన సాయంత్రం జరిగినప్పటికీ తమకు రాత్రి ఆలస్యంగా సమాచారం అందించారని, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపిస్తున్నారు.అలాగే, తాము కళాశాలకు చేరుకునేలోపే మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన అనంతరం హాస్టల్‌లో ఉన్న ఇతర విద్యార్థులను వారి ఇళ్లకు పంపిస్తున్నట్లు సమాచారం.

కళాశాల ముందు విద్యార్థి సంఘాల నిరసన..

విద్యార్థి మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని వారు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.