ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ నేతల చేతివాటం

Picsart_25-06-26_11-50-46-592.jpg

నేటి దర్శిని గుర్రంపోడు జూన్ 25 : పేదలకు ఇచ్చే ఇండ్లలో కూడా రాజకీయ పార్టీల అవినీతి తిమింగళాలు జొరబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇందిరమ్మ ఇంటి పథకంలో రాజకీయ దళారులు, కాదు.. కాదు.. అధికార పార్టీ నేతలు మోపయ్యారు. నిరుపేదలకు సొంతింటిని ఆశ చూపి రూ.లక్షలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పేదల దగ్గర స్వయంగా నాయకులు రూ.లక్షలు పోగు చేసుకుంటున్నట్లు మండల ప్రజల్లో బాగా ప్రచారం జరుగుతున్నది. గుర్రంపోడు మండలంలో ముఖ్య నేతలు ఇందిరమ్మ ఇంటికి రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పేదలకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇండ్లు.. ఇల్లు ఉన్న వారికి, పార్టీ నాయకులకు కేటాయిస్తూ నిజమైన అర్హులకు మొండి చేయి చూపిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు కావాలంటే అయితే కాంగ్రెస్ కార్యకర్త, లేదా డబ్బులు ముట్ట చెప్పాలి. నిజమైన అర్హులకు మాత్రం ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదు. పెద్ద నాయకులు రూ.లక్ష వసూలు చేస్తే గ్రామాల్లోని చిన్న నాయకులు రూ.30వేలు దండుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గూడు నీడ లేని పేదలకు సొంత ఇంటిని కట్టి ఇవ్వాలని నిర్ణయించింది. బలహీన వర్గాలకు అండగా నిలవాలనే కృతనిశ్చయంతో అర్హుల జాబితాను ప్రకటించి ఆయా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను సైతం అందించింది. దీంతో పలువురు అర్హులు ఇంటి నిర్మాణం కోసం ముగ్గులు పోసుకుని పనులు కూడా షురూ చేశారు.స్థానిక కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇళ్ల పేరు చెప్పి రూ.లక్షలు పోగు చేసుకుంటున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అటు అధికారుల పాత్ర కూడా కొంత ఉందనే వాదన వినిపిస్తోంది. ఈ నగదు ఆశించిన వారిలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ నుంచి మొదలు పెడితే అధికారుల వరకు పాత్ర ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కానీ.. స్థానిక ప్రజా ప్రతినిధులు కానీ ఈ అవినీతి తిమింగలాలు, ఈ దళారులు, దోపిడీదారులపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో విపరీతమైన పరిస్థితులు ఎదుర్కొనక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2 thoughts on “ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ నేతల చేతివాటం

Comments are closed.