బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉంది: ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

IMG-20251018-WA0027.jpg

🔴   బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ అచంచలమైన నిబద్ధత

🔴   బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రతి అడుగులోనూ పోరాటం

🔴   బీజేపీ తమ రాజకీయ స్వార్థాన్ని వీడాలి.. బీసీ బిల్లులు ఆమోదించి బీజేపీ చిత్తశుద్ధి చాటుకోవాలి

🔴   రాహుల్ గాంధీ గారి దార్శనికతతో కులగణన ప్రారంభం – సీఎం రేవంత్ రెడ్డి కృషి అభినందనీయం

🔴   టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో దేవరకొండలో విజయవంతమైన ‘బీసీ బంద్’

🔴   దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

నేటి దర్శిని: ప్రత్యేక ప్రతినిధి, దేవరకొండ,(అక్టోబర్ 18):
బీసీల రాజకీయ, సామాజిక సాధికారతకు కీలకమైన రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ పార్టీకి అచంచలమైన చిత్తశుద్ధి ఉందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బలంగా ప్రకటించారు. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిరసనగా దేవరకొండ పట్టణంలో నేడు నిర్వహించిన “బీసీ బంద్” కార్యక్రమంలోఆయన నియోజకవర్గంలోని వేలాది మంది ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొని బీసీ సంఘాల నాయకులు తలపెట్టిన బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపి, కేంద్రం తీరును తీవ్రంగా ఖండించారు.

బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం:
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ గారు మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల పట్ల రాజకీయ స్వార్థంతో వ్యవహరిస్తోందని, వారి హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. “బీసీ బిల్లులు గత కొంతకాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులను తక్షణమే ఆమోదించి, బీసీలకు న్యాయం చేయాలని బీజేపీ నేతలను డిమాండ్ చేస్తున్నాం. బిల్లులు ఆమోదింపజేసి, బీజేపీ నేతలు తమ చిత్తశుద్ది చాటుకోవాలి. బీసీ బిల్లుల విషయంలో బీజేపీ తమ రాజకీయ స్వార్థాన్ని, మొండి వైఖరిని వీడాలి” అని ఆయన గట్టిగా వ్యాఖ్యానించారు. ఈ “బీసీ బంద్” ఉధృతిని చూసైనా కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు.

బీసీల 42% రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరాటం:
బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. బీసీల 42% రిజర్వేషన్ల కోసం అవసరమైతే న్యాయస్థానంలో,పార్లమెంటులో , ప్రజల మధ్య, వీధుల్లో – ప్రతి అడుగులోనూ రాజీలేని పోరాటం చేస్తాం” అని ఆయన ఉద్ఘాటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపు అనేది ఒక రాజకీయ అంశం కాదని, అది వారి సామాజిక న్యాయం, ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశమని, కావున రాజకీయాలు, ఎన్నికలు పక్కన పెట్టి రిజర్వేషన్ల విషయంలో ప్రజలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవశ్యకత ఉందని ఆయన రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

రాహుల్-రేవంత్ రెడ్డి దార్శనికత:
బీసీల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నిబద్ధతను ఎమ్మెల్యే బాలు నాయక్ పలు ఉదాహరణలతో వివరించారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే దార్శనికతతోనే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా మొట్టమొదటిసారిగా జనగణనలో కులగణన జరగాలనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించడం జరిగిందని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ ఆశయ సాధన కోసం, బీసీల సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డెడికేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేసి, శాస్త్రీయ పద్ధతిలో కులగణన ప్రక్రియను ప్రారంభించింది. అంతేకాకుండా, స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ కల్పించాలనే సంకల్పంతోనే, హైకోర్టు ఇచ్చిన స్టేపై తక్షణమే సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ (Special Leave Petition) దాఖలు చేసిందని, ఇది బీసీ రిజర్వేషన్ల పట్ల కాంగ్రెస్ పార్టీ యొక్క నిజమైన, నిస్వార్థమైన చిత్తశుద్ధికి బలమైన నిదర్శనం అని ఆయన స్పష్టం చేశారు.

ఈ “బీసీ బంద్” కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ముఖ్య నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, సీపీఐ నాయకులు, బీసీ సంఘాల, మాల మహానాడు సంఘ0, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు.