శరీర దారుఢ్యానికి క్రీడలు దోహదం: రాజ్ కుమార్ రెడ్డి
పేరపళ్ల మీది తండలో ఎంపీఎల్ సీజన్-3 క్రికెట్ టోర్నీని ప్రారంభించిన రాజ్ కుమార్ రెడ్డి
క్రీడాకారులతో కలిసి క్రికెట్ ఆడిన రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేట,ఆగస్టు29 (నేటి దర్శిని): గిరిజన యువకులు జట్లుగా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ లో భాగస్వాములు కావడం అభినందనీయమని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా పేరపళ్ల మీది తండకు చెందిన గిరిజన యువకులు తండ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ఎంపీఎల్ సీజన్-3 క్రికెట్ టోర్నీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్ కుమార్ రెడ్డి విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు క్రీడాకారులను రాజ్ కుమార్ రెడ్డి పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. గిరిజన యువకులు ఒక చోటకు చేరి క్రికెట్ టోర్నమెంట్ ను కలిసికట్టుగా నిర్వహించడం సంతోషకరమని అన్నారు. గ్రామ స్థాయి నుండి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎదగాలని సూచించారు. క్రీడాకారులకు ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదిస్తే వారికి చేయూతనిచ్చేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డి క్రికెట్ ఆడారు. అనంతరం నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సంతోష్ కుమార్, కిష్ట్యానాయక్, లష్కర్ నాయక్, శేవనాయక్, శ్రీనివాస్ నాయక్, గోపాల్ నాయక్, సురేష్ నాయక్, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, గోపాల్ గౌడ్, సల్ల వెంకటేష్, వై.సంతోష్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, కృష్ణయాదవ్, నాగురావు, అశోక్, చామకూర నగేష్, నర్సింహ, అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.


