ePaper
Monday, July 20, 2026
📄 ePaper
BREAKING NEWS
Loading News...
spot_img
Homeతెలంగాణతెలంగాణలో కృత్రిమ ఇంధన కొరత..!

తెలంగాణలో కృత్రిమ ఇంధన కొరత..!

📰 Generate e-Paper Clip

బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులతో ప్రజలకు ఇబ్బందులు..!

కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయన్న ఆయిల్ కంపెనీలపై ఆరోపణలు..!

రైతులు, రవాణా రంగంపై ప్రభావం

బ్లాక్ మార్కెట్ విక్రయాలపై విమర్శలు?

సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వ జోక్యం కోరిన సీపీఎం

నిడమానూరు, ఏప్రిల్ 28 (నేటి దర్శిని): తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత నెలకొన్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను పేర్కొన్నారు. మంగళవారం నిడమానూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయిల్ కంపెనీలు లాభాపేక్షతోనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని చెబుతూనే, మరోవైపు సరఫరా నిలిపివేయడం అనుమానాస్పదమని అన్నారు. ఇరాన్-ఇజ్రాయిల్ పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన చమురు సంక్షోభాన్ని ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎన్నికల నేపథ్యంలో ధరలను నియంత్రించి, అనంతరం పెంపుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు.
రష్యా నుంచి తక్కువ ధరలకు ముడి చమురు దిగుమతి చేస్తున్నప్పటికీ, ఆ ప్రయోజనాలను ప్రజలకు అందించడం లేదని, కార్పొరేట్ సంస్థలకు మేలు జరుగుతోందని అన్నారు. పెట్రోల్ బంక్ డీలర్లు భారీ డిపాజిట్లు చెల్లించినప్పటికీ ఆయిల్ ట్యాంకర్ల సరఫరా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. డీజిల్ కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రవాణా రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని, దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొందరు బంక్ యజమానులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు ఇంధనం విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, అన్ని బంకులకు ఇంధన సరఫరా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి కందుకూరు కోటేష్, మండల కమిటీ సభ్యులు కోమాండ్ల గురువయ్య, మళ్లికంటి చంద్రశేఖర్, వెంపటి మహేష్, బొడ్డు లింగయ్య, కోమాండ్ల ఆంజనేయులు, వింజమూరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular