– కేబుల్ టీవీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశంలో కేబుల్ టివి సి.ఈ.ఓ.లు
హైదరాబాద్, ఏప్రిల్08 (నేటి దర్శిని): తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా కేబుల్ టీవీ సంస్థల సీఈఓలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ప్రస్తుత జీవో ప్రకారం కేబుల్ టీవీ సంస్థలకు రాష్ట్ర స్థాయిలో అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. నెట్‌వర్క్ ఉన్న ప్రతి జిల్లాలో కనీసం ఆరు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా ఐ అండ్ పీఆర్ అధికారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి చానళ్ల పనితీరుపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. కేబుల్ టీవీ సంస్థలకు ప్రభుత్వం తరఫున ప్రకటనలు కేటాయించాలని, జిల్లాల్లో కేబుల్ టీవీ స్టూడియోలపై ఉన్న నిబంధనలను సడలించాలని కోరారు. ప్రతి కేబుల్ టీవీ సంస్థకు అసెంబ్లీ పాసులు మంజూరు చేయాలని, అలాగే ఆన్‌లైన్‌లో ప్రసారమవుతున్న ప్రతి ఛానల్ నంబర్లను స్టేట్ పబ్లిసిటీ గ్రూపులో చేర్చాలని కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్లు బి. నరసింహ చారి, పొదుల్ల వెంకట్, డాక్టర్ మహ్మద్ యాసిఫ్ పాషా, మహేష్ కుమార్ ఉపాధ్యాయ, విద్యాసాగర్, బరిగల శివ, నరసింహులు, నాగేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.




