Newspaper Banner
Date of Publish : 09 September 2026, 9:08 am Digital Edition : NETI DRASHINI

రుద్రారం హైస్కూల్‌లో ఏడో తరగతి విద్యార్థిపై కర్రతో దాడి?

ధనుష్‌ను సుధా మేడం తీవ్రంగా కొట్టారంటూ తండ్రి ముత్తంగి నారాయణ ఆరోపణ

చిన్నారిపై శారీరక దాడి నిజమేనా?.. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్

పటాన్‌ చెరు సెప్టెంబర్ 8 (నేటి దర్శిని): సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండల రుద్రారం హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ధనుష్‌పై ఉపాధ్యాయురాలు సుధా మేడం కర్రతో తీవ్రంగా కొట్టినట్లు విద్యార్థి తండ్రి ముత్తంగి నారాయణ ఆరోపించారు. సెప్టెంబర్ 7న పాఠశాలలో ఈ ఘటన జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.తన కుమారుడిని కర్రతో పలుమార్లు కొట్టడంతో భయాందోళనకు గురయ్యాడని, ఘటనపై తాను తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు నారాయణ తెలిపారు. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే పేరుతో శారీరకంగా కొట్టడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఈ ఘటనతో తలెత్తుతున్నాయి. ఘటనపై పాఠశాల యాజమాన్యం వెంటనే స్పందించి, విద్యాశాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని నారాయణ కోరారు. తన కుమారుడిపై జరిగిన ఘటనకు బాధ్యులు ఎవరైనా ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం, సంబంధిత ఉపాధ్యాయురాలి వివరణ వెలువడాల్సి ఉంది.