Newspaper Banner
Date of Publish : 15 July 2026, 7:10 am Digital Edition : NETI DRASHINI

నిడమనూరులో సంచలనం..

కారులో యువకుడిని ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు

నిడమనూరు, జూలై 15 (నేటి దర్శిని): నిడమనూరు మండలంలో ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కారులో అపహరించారనే ఆరోపణలు స్థానికంగా కలకలం రేపాయి. ఊటుకూరు గ్రామానికి చెందిన బొల్లెపల్లి శేఖర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, బొల్లెపల్లి శేఖర్ మంగళవారం (జూలై 14) పని నిమిత్తం హాలియాకు వెళ్లి, రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరిగి ఊటుకూరు గ్రామానికి వస్తుండగా, ఎక్కలూరు మైసమ్మ ఆలయం నుంచి ఊటుకూరుకు వెళ్లే మార్గంలో గుర్తుతెలియని వ్యక్తులు కారులో బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపించారు.ఈ ఘటనపై కుటుంబ సభ్యులు రాత్రి 11 గంటల సమయంలో నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం బుధవారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో చెరువుగట్టు ఫ్లైఓవర్ సమీపంలో తనను దుండగులు వదిలివెళ్లినట్లు శేఖర్ తెలిపినట్లు సమాచారం. అక్కడి నుంచి స్థానికుల ఫోన్ తీసుకుని గ్రామస్తులకు సమాచారం అందించినట్లు తెలిసింది.తనను తీసుకెళ్లిన కారులో మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారని శేఖర్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం శేఖర్ నిడమనూరు పోలీసుల ఆధీనంలో ఉండగా, ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.