Newspaper Banner
Date of Publish : 12 June 2026, 7:48 am Digital Edition : NETI DRASHINI

గంజాయి సరఫరాపై ఉక్కుపాదం..

ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్ 

మిడ్జిల్, జూన్11( నేటి దర్శిని ప్రతినిధి ):మహబూబ్ నగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, సరఫరాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మిడ్జిల్, బోయిన్‌పల్లి, వాడియాల ప్రాంతాల్లో నార్కోటిక్ బృందంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలకు మిడ్జిల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శ్రీనివాస్ యాదవ్ నాయకత్వం వహించగా, పోలీసు సిబ్బంది మరియు నార్కోటిక్ బృందం సభ్యులు పాల్గొన్నారు.తనిఖీల సందర్భంగా ప్రధాన రహదారులు, గ్రామాల ప్రవేశ మార్గాలు, అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను విచారించడంతో పాటు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం సేకరించడంతో పాటు, నేర కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ సందర్భంగా ఎస్‌ఐ శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు.ప్రజల సహకారంతో గంజాయి నిర్మూలనకు మరింత సమర్థవంతంగా చర్యలు తీసుకుంటామని, మత్తు పదార్థాల అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల నియంత్రణ కోసం ఇలాంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్సై శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.