Newspaper Banner
Date of Publish : 09 June 2026, 10:33 am Digital Edition : NETI DRASHINI

ఆర్&బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఆస్తులపై ఏసీబీ దాడులు

వందల కోట్ల అక్రమ ఆస్తుల ఆరోపణలు.. 

15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ తనిఖీలు..

హైదరాబాద్, జూన్ 9(నేటి దర్శిని): రోడ్లు భవనాల శాఖ (ఆర్&బీ) ఇంజినీర్-ఇన్-చీఫ్ (ఈఎన్‌సీ) మోహన్ నాయక్‌కు చెందిన ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మంగళవారం విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. ప్రాథమిక వివరాల ప్రకారం, హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో మొత్తం 15 చోట్ల ఏసీబీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించాయి. మోహన్ నాయక్‌కు, ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులకు చెందిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర ఆస్తుల వద్ద సోదాలు కొనసాగాయి. ఉన్నతాధికారిగా ఉన్న తన పదవిని దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సమకూర్చుకున్నారనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేపట్టింది. సోదాల సందర్భంగా పలు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులు, ఆస్తుల వివరాలను అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.అయితే ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువపై ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. సోదాలు పూర్తయిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది

.