సింక్రోనస్ డ్యూయల్ ప్రైమరీ క్యాన్సర్స్’పై విజయం సాధించిన యశోద వైద్యులు
మిర్యాలగూడ, మే 29 (నేటి దర్శిని):మలక్‌పేట్ యశోద ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక రేడియేషన్ సాంకేతికతను వినియోగించి ఒకేసారి రెండు వేర్వేరు క్యాన్సర్లకు విజయవంతంగా చికిత్స అందించి అరుదైన వైద్య విజయాన్ని నమోదు చేశారు. 64 ఏళ్ల మహిళకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తో పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించి సమగ్ర వైద్యం అందించారు. పీవీ బ్లీడింగ్ సమస్యతో చికిత్స కోసం వచ్చిన మహిళకు నిర్వహించిన పరీక్షల్లో గర్భాశయ ముఖద్వారంలో స్క్వామస్ సెల్ కార్సినోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం యశోద ఆసుపత్రిలో నిర్వహించిన పీఈటీ-సీటీ స్కాన్‌లో ఎడమ ఊపిరితిత్తిలో మరో క్యాన్సర్ గడ్డను వైద్యులు గుర్తించారు. తదుపరి బయాప్సీ, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ (ఎన్‌జీఎస్) పరీక్షల ద్వారా అది ఈజీఎఫ్‌ఆర్ పాజిటివ్ లంగ్ అడెనోకార్సినోమా అని తేలింది. ఈ కేసును వైద్యులు అత్యంత అరుదైన ‘సింక్రోనస్ డ్యూయల్ ప్రైమరీ క్యాన్సర్స్’గా గుర్తించారు. డా. నివాలికా రాజమోని, డా. ఎల్. రోహిత్ రెడ్డి నేతృత్వంలోని వైద్య బృందం రోగికి అత్యాధునిక ప్రెసిషన్ రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, బ్రాకీథెరపీతో పాటు లక్ష్యిత చికిత్సలను సమన్వయంతో అందించింది. ఊపిరితిత్తులు మరియు పెల్విక్ ప్రాంతాలకు ఒకేసారి రేడియేషన్ అందిస్తూ ఆరోగ్యకరమైన అవయవాలకు ఎటువంటి హాని కలగకుండా చికిత్స నిర్వహించినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పూర్తై రెండేళ్లు గడిచిన అనంతరం నిర్వహించిన తాజా పీఈటీ-సీటీ స్కాన్‌లో ఎటువంటి క్యాన్సర్ ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడించారు. ప్రస్తుతం రోగి పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆధునిక వైద్య సాంకేతికత, మల్టీడిసిప్లినరీ క్యాన్సర్ కేర్ విధానం, అనుభవజ్ఞులైన వైద్య బృందం సమన్వయ కృషి వల్లే ఈ అరుదైన విజయం సాధ్యమైందని ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.