Newspaper Banner
Date of Publish : 05 December 2025, 4:25 pm Digital Edition : Unknown Author

గుర్రంపోడు మండలంలో నామినేషన్ల వద్ద గందరగోళం

– అభ్యర్థుల్లో ఆందోళన – అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

– ఉదయం నుంచే వేచి చూస్తున్న అభ్యర్థులు

– సమయం మించిపోతుండటంతో ఉద్రిక్తత

– అధికారుల నిర్లక్ష్యం, అభ్యర్థుల ఆవేదన

– కనీస వసతులు కల్పించని అధికారులు

గుర్రంపోడు, డిసెంబర్ 5 (నేటి దర్శిని):
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమర్పణ ప్రక్రియలో గుర్రంపోడు మండలంలో గందరగోళం నెలకొంది. ఉదయం నుండి నామినేషన్లు సమర్పించడానికి వచ్చిన అభ్యర్థులు, అధికారులు నత్త నడకన నామినేషన్ స్వీకరిస్తుండడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు తమ ప్రతినామా పత్రాలను సమర్పించడానికి మండల కేంద్రంలోని రైతు వేదిక ఎదుట గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

సమయం గడుస్తున్న కొద్దీ అభ్యర్థుల ఆందోళన మరింత పెరిగింది. “మేము ఉదయం నుంచే వచ్చాం, కానీ ఎవ్వరూ సక్రమంగా స్పందించడం లేదు. సమయం మించిపోతే మా నామినేషన్ అవకాశమే కోల్పోతాం” అని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

అభ్యర్థుల తాకిడితో మండలలోని రైతు వేదిక కార్యాలయ పరిసరాలు రద్దీగా మారాయి. కొంతమంది అభ్యర్థులు నీరు లేక, కుర్చీలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. “అధికారులు విధుల్లో నిర్లక్ష్యం కారణంగా ఈ గందరగోళం వచ్చిందని” అని స్థానికులు వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగాలంటే అధికారులు మరింత సమయపాలన పాటించాలని, అభ్యర్థులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు సూచిస్తున్నారు. సమయం క్రమంగా గడుస్తుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది.

మరోవైపు, కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించకముందే సమయం ముగిసిపోతుందేమోనని భయపడుతున్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యమని వారు వ్యాఖ్యానించారు.

మొత్తం మీద, గుర్రంపోడు మండలంలో నామినేషన్ దశలో ఏర్పడిన ఈ గందరగోళం, ఎన్నికల నిర్వహణలోని లోపాలను బహిర్గతం చేస్తోంది. అభ్యర్థులు, ప్రజలు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.