Newspaper Banner
Date of Publish : 01 September 2025, 1:02 pm Digital Edition : Unknown Author

రైతులకు యూరియా అందించాలంటూ నిడమనూరులో సిపిఎం రాస్తారోకో, ధర్నా

నిడమనూరు, సెప్టెంబర్01 (నేటి దర్శిని): నిడమనూరు మండల కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా పంటల రక్షణకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో సరిపడా అందించాలంటూ సిపిఎం నాయకత్వంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఉదయం 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు రాస్తారోకో కొనసాగి, వందలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కమిటీ సభ్యులు వింజమూరి శివ, కిరణ్ మాట్లాడుతూ – ప్రస్తుతం మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగు పనులు ముందుకు సాగడానికి యూరియా సరఫరా అత్యవసరమని పేర్కొన్నారు. పంటల పెరుగుదల దశలో యూరియా లభ్యం కాకపోవడం వల్ల ఇప్పటికే పలు గ్రామాల్లో పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు నష్టపోవడం తగదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తరువాత నిడమనూరు తాసిల్దార్ ఆఫీస్ ముందు సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేస్తూ, ప్రభుత్వాన్ని తక్షణం స్పందించాలని కోరారు. స్థానిక సమస్యలు, ముఖ్యంగా ఎరువుల కొరత, సాగునీటి సమస్యలు, రుణమాఫీ వంటి అంశాలను ఈ సందర్భంలో వారు ఎత్తి చూపారు. సిపిఎం నాయకులు మాట్లాడుతూ – రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైతే మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా, రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. రైతుల న్యాయమైన డిమాండ్లను అధికారులు గౌరవించి వెంటనే చర్యలు చేపట్టాలని సిపిఎం నాయకులు స్పష్టం చేశారు.