Newspaper Banner
Date of Publish : 07 February 2025, 10:40 am Digital Edition : Unknown Author

గుర్రంపోడులో నీటి  సమస్యతో అల్లాడుతున్న ప్రజలు

మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం

గుర్రంపోడు ఫిబ్రవరి07 (నేటిదర్శిని):

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో తాగునీటి కొరతతో తీవ్రంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ప్రస్తుతం గ్రామ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, గత పది రోజులుగా నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రతిరోజూ గృహాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉండగా, ఇటీవల నీరు రావడం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు ఇతర మార్గాల్లో నీటి కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు తాగునీటి లేమితో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ హాస్టల్‌లో తాగునీరు లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతుండటం, ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది మిషన్ భగీరథ అధికారులకు సమస్యను ఎన్నిసార్లు తెలిపినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. తాగునీటి సమస్య తక్షణమే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరాను పునరుద్ధరించాలి, లేకపోతే ఈ సమస్య మరింత ముదిరి ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామస్థుడు శ్రీకాంత్