Newspaper Banner
Date of Publish : 17 December 2024, 12:41 pm Digital Edition : Unknown Author

లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు

గుర్రంపోడు, డిసెంబర్ 17 (నేటిదర్శిని):
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.ఆర్ పిలుపు మేరకు, నాగార్జున సాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ ఆదేశాలతో, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నాగులవంచ తిరుపతి రావు గుర్రంపోడు మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ ఆయన, లగచర్ల రైతులపై అక్రమ కేసులు నమోదు చేసి, వారిపై థర్డ్ డిగ్రీని అమలు చేయడం, జైల్లో నిర్బంధించడం అమానవీయ చర్య అని విమర్శించారు. వెంటనే రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “రైతన్నలపై అమలు చేస్తున్న అణిచివేత విధానాలకు ప్రజలు భరించరని, ప్రజా ప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చినప్పుడు రైతులు తిరగబడతారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో రైతులు తగిన బుద్ధి చెబుతారు” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.